మద్దికేర, ఆగస్టు 1 ( ప్రభ మనం,న్యూస్)
మద్దికేర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ ఉపకేంద్రం ద్వారా పెరవలి, బసినేపల్లి, రామాపురం, రామాపురం కొట్టాల, మదనతపురం గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది. దీంతో తక్కువ వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యలు తగ్గి రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
5 ఎంవీఏ సామర్థ్యంతో నిర్మించిన ఈ ఉపకేంద్రం భవిష్యత్తు విద్యుత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

